పీఎంవో అధికారి నంటూ అధికారిక రాచ మర్యాదాలు పొందిన కిరణ్ పటేల్ అనే వ్యక్తిని జమ్ము పోలీసులు నిన్న అరెస్టు చేశారు. తాజాగా ఆయన్ని తన భార్య సమర్థించింది. అతను ఎలాంటి తప్పు చేయడని తనకు నమ్మకం ఉందని అతని భార్య మాలినీ పటేల్ పేర్కొన్నారు.
తన భర్త ఒక ఇంజనీర్, తాను ఒక డాక్టర్ అని ఆమె వెల్లడించారు. తన భర్త ఇంజనీర్ కావడం వల్ల డెవలప్ మెంట్ వర్క్ పై అక్కడికి వెళ్లారన్నారు. అంతే కానీ వేరే కారణం లేదన్నారు. అతను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన భర్త ఎలాంటి తప్పు చేయడన్నారు.
ఈ విషయాన్ని తమ న్యాయవాది చూస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో తాను ఇంకేమి చెప్పలేనన్నారు. అసలు ఏం జరిగిందంటే… దక్షిణ కశ్మీర్‌లోని యాపిల్ తోటల కొనుగోలుదారులను గుర్తించే పనిని తనకు ప్రభుత్వం అప్పగించిందని మొదట కిరణ్ పటేల్ చెప్పారు.
ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్‌లు, రాజకీయ నాయకుల పేర్లను చెప్పడంతో కొంత మంది ఐఏఎస్ అధికారులు అతన్ని ఓ ఉన్నతాధికారిగా నమ్మారు. కిరణ్ మొత్తం మూడు సార్లు కశ్మీర్ లో పర్యటించారు. మొదట భార్య పిల్లలతో ఆయన కశ్మీర్ కు వచ్చారు.
ఆ తర్వాత కశ్మీర్ ప్రాంతంలో పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ది బాధ్యతను కేంద్రం తనకు అప్పగించిందన్నారు. ఈ మేరకు జమ్ములోని పలు టూరిస్టు ప్లేసుల్లో ఆయన పర్యటించారు. ఆ సమయంలో అతనికి జమ్ము కశ్మీర్ అధికారులు భద్రత కూడా కల్పించారు.
ఆ తర్వాత పలువురు ఉన్నతాధికారులతో కిరణ్ సమావేశాలు కూడా నిర్వహించారు. కశ్మీర్ లో రాజకీయ పరిస్థితులను పరిశీలించాలని తనను కేంద్రం పంపిందంటూ చెప్పి అక్కడి రాజకీయ నేతలతో కూడా కిరణ్ సమావేశం అయ్యాడు. కశ్మీర్ లో అతను జెడ్ ప్లస్ కేటగిరి భద్రత నడుమ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద గల కమాన్ గేట్, శ్రీ నగర్ లాల్ చౌక్, పుల్వామాలోని స్పైస్ పార్క్ లలో పర్యటించారని పోలీసులు వెల్లడించారు.
కిరణ్ కదలికలపై అనుమానం రావడంతో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్ పోలీసులకు సమాచారం అందించారు. లలిత్ హోటల్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పారు. అతను కేంద్రం పంపిన అధికారి అని చెబుతున్నాడని సీఐడీ తెలిపింది. ఆయన కదలికలు, సమాధానాలు అనుమానాస్పదంగా వున్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చింది.
ఈ క్రమంలో కిరణ్ ను నిషత్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ విచారణ జరపగా కిరణ్ తన నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతని దగ్గర నుంచి పది నకిలీ విజిటింగ్ కార్డులు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.