జమ్మూ కాశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా హత్యకేసు నిందితుడు యాసిర్ రాసుకున్న ఓ డైరీని పోలీసులు ఆయన ఇంటి నుంచి .స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని అంశాలను వారు మీడియాకు విడుదల చేశారు. తన జీవితం దాదాపు వంద శాతం వ్యధాభరితమని, తనది ఫేక్ స్మైల్ అని యాసిర్ రాసుకున్నాడు. ఈ డైరీని బట్టి చూస్తే యాసిర్ తీవ్రమైన మానసిక డిప్రెషన్ తో బాధపడేవాడని తెలుస్తోందని పోలీసులు చెప్పారు. ఇది అతని మానసిక స్థితిని తెలియజేస్తోందని, కానీ తాము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు.
కొన్ని రోజులుగా లోహియా జమ్మూ శివార్లలోని తన స్నేహితుని ఇంటిలో. ఉంటున్నారని, నిన్న రాత్రి ఆయన డిన్నర్ ముగించుకుని గదిలోకి వెళ్లి తన కాలికి ఏదో ఆయిల్ రాస్తుండగా యాసిర్ ఆయనకు సాయం చేస్తానంటూ వెళ్లి హఠాత్తుగా ఆయనపై దాడి చేశాడని ముకేశ్ సింగ్ తెలిపారు. యాసిర్ ప్రవర్తన దూకుడుగా ఉండేదని, నిలకడ లేని మనిషి అని ఈ డైరీ ద్వారా తెలుస్తోందన్నారు.
ఇందులో కొన్ని విషాద భరితమైన హిందీ పాటల్లోని వాక్యాలున్నాయని, పైగా హృదయ భారం, జీవన్మరణాలు, వంటి పదాలు రాసుకున్నాడన్నారు.
‘జీవితాన్ని ద్వేషిస్తున్నా.. ఇది కేవలం విషాదాన్నే తెస్తుంది.. మరణమే శాంతినిస్తుంది’ అనే హిందీ పాటను ఈ డైరీలో ప్రస్తావించాడని ఆయన చెప్పారు. మరణమా ! నా జీవితంలోకి రా.. నీ కోసం ఎదురు చూస్తున్నా వంటివాటిని కూడా యాసిర్ రాసుకున్నాడట . నా లైఫ్ లో సంతోషమన్నది ఒక శాతం ఉంటే 10 శాతం లవ్ ఉందని, టెన్షన్ 90 శాతం, ఫేక్ స్మైల్ వంద శాతం ఉందని కూడా పేర్కొన్నాడట. ఈ కేసులో ఇతడ్ని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు.