నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఎమ్మెల్యే కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తన ఫోన్ ని ట్యాప్ చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. తన మీద, తన కదలికల మీద నిఘా పెట్టారని బాంబ్ పేల్చారు. తన ఫోన్ ని ట్యాప్ చేస్తున్న విషయం తనకు ముందే తెలుసని, అందుకే ఆ ఫోన్లో ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతున్నానని అన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు తన వద్ద వేరే ఫోన్ ఉందని, చాలా సిమ్ కార్డులు కూడా ఉన్నాయని అన్నారు.
చేతనైతే వీటిని కూడా ట్యాప్ చేయండని, అవసరమైతే ఇందుకోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించుకోండని సవాల్ విసిరారు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసుల సమయంలో.. అప్పటి ఎస్పీ తన ఫోన్ పై నిఘా ఉంచారన్నారు. ఈ సమాచారం తనకు తెలియడంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాట్లాడేవాడినని తెలిపారు. ఫేస్ టైమర్,టెలిగ్రాం కాల్స్ ని పెగాసస్ రికార్డు చేయలేదన్నారు.
30 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడెలా ప్రవర్తించాలో తనకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయినా.. అధికారి పార్టీ ఎమ్మెల్యే పై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా.. అని కోటం రెడ్డి ప్రశ్నించారు. అంతకు ముందు నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై కోటం రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజకీయ వారసత్వంతో ఎదగలేదని, స్వతహాగా పోరాటాలతో ఈ స్థాయికి వచ్చానని అన్నారు.
తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని ఆరోపణలు చేశారు. తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా.. ఆ పెద్ద కుటుంబాలు అనేక సార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వాళ్లే అనుభవిస్తున్నారని.. ఇక పై ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు.