యోగాగురు బాబా రామ్ దేవ్ ఈ మధ్య సైలెంట్ అయిపోయినట్టున్నారు. చాలా రోజులుగా ఆయనకు సంబంధించిన వార్తలో, సమాచారమో లేదు. మరీ ఇంత కామ్ గా ఉన్నా తన పాపులారిటీకే ఎసరొస్తుందేమోనని భావించిన ఆయన.. ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఇటీవలి రోజుల్లో అన్ పాపులర్ అయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ పేరును ప్రస్తావించారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కార్పొరేట్లు తమ స్వార్థ ప్రయోజనాలకోసమే తమ సమయాన్ని 99 శాతం వృధా చేస్తారని కానీ నా విషయం వేరని అన్నారు.
అదానీ, అంబానీ, ఇంకా చెప్పాలంటే టాటా, బిర్లా వంటి దిగ్గజాల కన్నా తన సమయాన్నికున్న విలువ ఎక్కువని ఆయన అన్నారు. ‘హరిద్వార్ నుంచి మూడు రోజుల పర్యటనకు ఇక్కడికి వచ్చాను.. ఇక్కడో విషయం చెప్పదలచుకున్నా.. ఆ బిలియనీర్లంతా తమ స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా 99 శాతం సమయాన్ని గడుపుతుంటారు.. వాళ్ళతో పోలిస్తే నాదే అత్యంత విలువైన సమయం’ అని బాబా రామ్ దేవ్ వ్యాఖ్యానించారు.
సామాన్య ప్రజలకోసం నా సమయాన్ని వెచ్చిస్తా అని ఆయన చెప్పారు. తన అధీనంలోని పతంజలి యోగా సంస్థ ఒకప్పుడు నిధుల్లేక నీరసించి ఖాయిలా పడే స్థితికి చేరుకుందని, కానీ సీఈఓ ఆచార్య బాలకృష్ణ దాన్ని తన అద్భుత సామర్థ్యంతో వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి 40 వేల కోట్ల టర్నోవర్ గల సంస్థగా మార్చారని ఆయన ప్రశంసించారు. అది ఆయన ప్రొఫెషనల్ గవర్నెన్స్ కి , పారదర్శక మేనేజ్మెంట్ కి, జవాబుదారీతనానికి నిదర్శనమన్నారు.
ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్.. బాబా రామ్ దేవ్ ను, ఆచార్య బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. దేశంలో పతంజలి ఆయుర్వేదానికి గల ప్రాశస్త్యాన్ని వారు వివరించారు.