“హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిస్తే… ఉత్తమ్‌కు లాభం
టీఆర్ఎస్ గెలిస్తే… హుజుర్‌నగర్‌కు లాభం ఇది టీఆర్ఎస్ నినాదం
కానీ ఎవరు గెలిచినా… మైహోం రామేశ్వర రావుకు లాభం అనేది జనం టాక్ “
అవును. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా, ఓడినా… ఏ పార్టీ జయకేతనం ఎగరేసినా… సంతోష పడటంలో మాత్రం ముందుండేది ఆయనే. ప్రస్తుతం పోటీలో ఉన్న పీసీసీ చీఫ్ సతీమణి పద్మావతిరెడ్డి గెలిచినా, టీఆర్ఎస్ నుండి సైదిరెడ్డి గెలిచినా ఆయనతో సఖ్యత కోరుకునే వారే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలయినప్పటికీ, హుజూర్ నగర్‌లో ఉత్తమ్ గెలవగానే… సతీసమేతంగా రామేశ్వర రావు ఇంటికి వెళ్లి కలిసి వచ్చారన్న చర్చ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమరాన్నే రేపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రామేశ్వర రావుకు ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలున్నాయి. రామేశ్వర రావు కీలకమైన సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలకు హుజూర్ నగరే కేంద్ర బిందువు అన్న టాక్ ఉంది. అయితే, రామేశ్వర రావు టీఆరెఎస్‌తో సన్నిహితంగా ఉంటారు, మీరు ఎలా ఆయనతో కలుస్తారని ఉత్తమ్‌ను పార్టీలో నిలదీసినా… ఉత్తమ్ ఫ్యామిలీ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే సాగుతోంది. గడిచిన ఎన్నికల్లోనూ, ప్రస్తుత ఎన్నికల్లోనూ ఉత్తమ్ కు అన్నిరకాల సాయం ఇక్కడ నుండే అందబోతుంది. సో… ప్రస్తుత ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా రామేశ్వర రావు గెలిచనట్లే అన్నమాట.
ఇక టీఆర్ఎస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టీఆరెఎస్‌కు రామేశ్వర రావు ఆత్మబంధు అంటున్నాయి రాజకీయ వర్గాలు. టీఆర్ఎస్ బాసే తమ మనిషి అయినప్పుడు టీఆర్ఎస్ తరుపున పోటీచేయబోయే సైదిరెడ్డి ఆటోమేటిక్‌గా తమ వారే అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. పైగా ఇక్కడ సైదిరెడ్డికి కూడా ఈ బైపోల్ గెలుపు కోసం అవసరమైన సహకారం రామేశ్వర రావు నుండే అందుతుందని జోరుగా చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ గెలిస్తే… నియోజకవర్గం మొత్తం ఆయన చెప్పిందే ఫైనల్ అనటంలో ఎలాంటి సందేహాం లేదు.
సో… కీలకమైన రెండు పార్టీలు, గెలిచినా-ఓడినా ఈ రెండు పార్టీలే మొదటి రెండు స్థానాల్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి… ఎవరు గెలిచినా ఆయా పార్టీల ఖాతాల్లోకి సంఖ్య మాత్రమే చేరుతుంది. అల్టీమేట్‌గా గెలిచేది మాత్రం మైహోం రామేశ్వర రావే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.