సృష్టిలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నా.. వాటిలో మనకు తెలియని జీవులు ఇంకా అనేకం ఉన్నాయి. అలాంటి జీవరాశుల్లో కొన్ని అప్పుడప్పుడు మనకు తారసపడుతుంటాయి. వాటిని చూసి మనం షాక్‌కు గురవుతుంటాం. సరిగ్గా అక్కడా అదే జరిగింది. సముద్రం నుంచి ఓ జీవి చనిపోయి బీచ్‌కు కొట్టుకువచ్చింది. దీంతో ఆ జీవిని చూసిన అక్కడి వారు షాక్‌కు గురయ్యారు. ఆ జీవి ఏమిటో తెలియకపోవడంతో కొందరు భయానికి లోనవ్వగా.. కొందరు మాత్రం దాన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆ జీవి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జూలై 29వ తేదీన బ్రిటన్‌లోని అయిన్స్‌డేల్ బీచ్‌కు ఓ జీవి శరీరం కొట్టుకువచ్చింది. అది చూసేందుకు చాలా విచిత్రంగా ఉంది. దాన్ని చూసిన చాలా మందికి ఆ జీవి పేరేమిటో, అది ఏ జాతికి చెందుతుందో తెలియలేదు. అది 15 అడుగుల పొడవుతో చిత్రమైన శరీర ఆకృతితో ఉంది. ఎముకలు ఎక్కడికక్కడ అతుక్కపోయాయి. శరీరంపై చర్మమంతా వేలాడుతోంది. దానికి మరో ఆకారం అతుక్కుని ఉంది. అంటే.. బహుశా ఆ జీవి మరో జీవికి జన్మనిస్తూ చనిపోయి ఉంటుంది.. అందువల్లే దాని శరీరం బీచ్‌కు కొట్టుకువచ్చి ఉంటుందని అనుకుంటున్నారు.
ఇక ఆ జీవికి చెందిన ఫొటోలను అక్కడి అయన్స్‌డేల్ కమ్యూనిటీ అనే ఫేస్‌బుక్ గ్రూపులో పోస్ట్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ జీవి ఏమిటో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు భారీ ఏనుగు అంటుంటే.. అవి అంతరించిపోయాయని.. అది వేరే ఏదో జీవి అయి ఉంటుందని అంటున్నారు. కాగా నాచురల్ ఇంగ్లండ్‌కు చెందిన సీనియర్ అడ్వయిజర్ స్టెఫన్ అయిలిఫ్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఆ జీవి భారీ తిమింగలం అయి ఉంటుందని అన్నారు. దాని కళేబరాన్ని ప్రస్తుతం బీచ్ నుంచి తొలగిస్తున్నామన్నారు. త్వరలోనే ఆ జీవి ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఏది ఏమైనా.. ఆ విచిత్ర జీవి మాత్రం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
అయితే గతంలో.. 2017లో ఫిలిప్పీన్స్‌లోనూ ఇదే తరహా సముద్ర జీవి కళేబరం ఒకటి బీచ్‌కు కొట్టుకువచ్చింది. అయితే ఆ జీవి ఏమిటో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. నిజానికి ఇలాంటి విచిత్ర జీవులు సముద్ర గర్భంలో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియాల్సి ఉంది.