ఏలూరులో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మూర్చ వచ్చినట్లు జనం ఉన్న చోటనే కుప్పకూలుతున్నారు. ఇప్పటికే బాధితుల సంఖ్య 400దాటగా, 168కి పైగా బాధితులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, కేంద్ర వైద్య బృందాలతో పాటు రాష్ట్రంలోని వైద్య నిపుణులు అసలు ఎందుకు ఇలా జరుగుతుందన్న కోణంలో పరిశీలన కొనసాగిస్తున్నారు.
నీటి అతి పరిశుభ్రత వల్లే ఇలా జరిగిందన్న అనుమానంతో గత రెండు రోజులుగా ఏలూరులో వివిధ ప్రాంతాల నుంచి 22 నీటి నమూనాలను, 9 చోట్ల పాల నమూనాలను సేకరించి విజయవాడ, గుంటూరు, ఏలూరులోని ప్రయోగశాలల్లో పరీక్షించారు. బాధితుల నుంచి 52 రక్త నమూనాలు, వెన్నుపూస నుంచి 35 నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. వీటి నివేదికల్లో అనుమానించదగ్గ లక్షణాలేవీ కనిపించలేదు. ఐఐసీటీ, ఎయిమ్స్, సీసీఎంబీలకు నీటి, రక్త, మల, మూత్ర నమూనాలతోపాటు బాధితుల ఇళ్ల నుంచి ఆహార నమూనాలు పంపించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు ఐసీఎంఆర్- ఎన్‌ఐఎన్ బృందం కూడా పరిశోధన మొదలుపెట్టింది. అంటురోగ పరిశోధన విభాగం శాస్త్రవేత్త డా.జేజే బాబు నేతృత్వంలో 9 మంది ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తల బృందం సోమవారం రాత్రికి ఏలూరు చేరుకుంది. వైద్యాధికారులను కలిసి పరిస్థితిని సమీక్షించింది. బాధితుల రక్త నమూనాలు సేకరించడంతోపాటు ఆహారం, తాగునీటి కల్తీ అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మంగళవారం మద్యాహ్నంలోపు కొంతైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కేవలం నీరు లేదా ఆహారం కలుషితమైతే.. ఇంట్లో వారందరిపైనా ప్రభావం చూపాలి. కానీ ఏలూరులో ప్రతి కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. చాలా కుటుంబాల్లో అసలు ఈ సమస్య కనిపించలేదు. దీంతో అన్నిరకాల పరీక్షలు చేస్తే గాని అసలు విషయం తెలియదంటున్నారు.