భూగర్భం నుంచి శబ్దం రావడంతో మహారాష్ట్రలోని లాతూర్ లో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలోని వివేకానంద్ చౌక్ సమీపంలో భూగర్భం నుంచి వింత శబ్దాలు వచ్చాయి. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బుధవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో భూమి లోపలి నుంచి ఒక్కసారిగా వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి. దాదాపు 15 నిమిషాల పాటు ఇలా శబ్దాలు వినిపించాయని అక్కడి స్థానికులు చెప్పారు. శబ్దాల విషయం క్షణాల్లోనే సిటీ మొత్తం పాకిపోయింది. దీంతో భూకంపం వస్తుందేమోనని జనం భయాందోళనలకు గురయ్యారు.
అనంతరం స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. వింత శబ్దాలకు గల కారణాలపై పరిశోధనలు మొదలు పెట్టారు. లాతూర్ లో భూకంపం వచ్చే సూచనలు ఏమీ లేవని డిజాస్టర్ మేనేజ్ మెంట్ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు.
లాతూర్ చుట్టుపక్కల ప్రాంతంలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయని చెప్పారు. 2022 సెప్టెంబర్ లో హసోరి, కిల్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూగర్భంలో నుంచి వింత శబ్దాలు వినిపించాయని గుర్తుచేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.
మరోవైపు భూగర్భంలో నుంచి వచ్చిన శబ్దాలు ఏ ఉపద్రవానికి సంకేతమోనని లాతూర్ వాసుల్లో ఆందోళన నెలకొంది. భూకంపం కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 1993లో కిల్లారీ గ్రామం చుట్టుపక్కల భూకంపం వచ్చి దాదాపు 10 వేల మంది చనిపోయారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ జనం భయంతో వణికిపోతున్నారు.