జపాన్ లో దొరికిన 300 ఏండ్ల నాటి ‘ మమ్మీ” పై జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. చూడటానికి అచ్చం మత్సకన్యలా కనిపిస్తున్న మమ్మీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విచిత్రమైన ఆకారంలో 12 అంగుళాలు ఉన్న ఈ మమ్మీ జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 1736-1741 మధ్యకాలంలో దొరికినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అది అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉంది.
దీని గురించి జపాన్‌లోని అసహి షింబున్ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం… పసిఫిక్ మహాసముద్రంలో మత్స్యకారులు చేపలు పడుతుండగా వారి వలలో ఓ పెట్టే వచ్చింది. దానితో పాటు ఓ లేఖ దొరికింది. అందులో మమ్మీ ఉంది. ఆ ఎండిపోయిన మమ్మీ అంతకు ముందు ఒక కుటుంబం దగ్గర ఉండేది. ఆ తర్వాత ఓ దేవాలయం స్వాధీనం చేసుకునే ముందు మరొకరికి చేరుకుంది.
రహస్యమైన జీవులపై పరిశోధన చేసిన జపనీస్ సహజ చరిత్రకారుడు కియోకి సాటోను ఓకాయామా ఫోక్‌లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషితా అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ వస్తువును కనుగొన్నారు. ఆ మమ్మీకి ఉన్న లక్షణాలు అందరని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మమ్మీకి పైభాగంలో తల. ముఖం అచ్చం మనిషిలా, కింది భాగం తోక, పొలుసులు అచ్చం చేపలాగా ఉంది.
దీని రహస్యాలను బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల కురాషికి వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు రీసెర్చ్ మొదలు పెట్టారు. దీని గురించి తెలుసుకునేందుకు ఇటీవల సీటీ స్కానింగ్ ప్రక్రియను నిర్వహించారు. దీనికి మత పరంగా చాలా ప్రాముఖ్యత ఉన్నట్టు ఒకయామా ఫోక్‌లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషితా అన్నారు. దీనికి సంబంధించి పురాణాల్లో చాలా గాథలు ఉన్నట్టు చెప్పారు.
” జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వం ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆ మత్స కన్య మాంసం తిన్న వారు ఎప్పటికీ చనిపోరు. జపాన్‌లోని ఒక ప్రాంతంలో ఒక మహిళ పొరపాటున మత్స్యకన్య మాంసాన్ని తిని 800 ఏళ్లు జీవించిందని ఒక పురాణ గాథ ఉంది” అని ఒకయామా ఫోక్‌లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషితా అన్నారు.
‘ ఈ ‘యావో-బికుని’ పురాణం కూడా మత్స్యకన్య మమ్మీ కనుగొనబడిన ఆలయం సమీపంలో భద్రపరచబడింది. పురాణాన్ని విశ్వసించే వారిలో కొందరు మత్స్యకన్యల మమ్మీల పొలుసులను చెవిలో పెట్టుకునే వారు” అని చెప్పారు. కానీ ఇది నిజమైన మత్స్యకన్య అని తాను నమ్మడం లేదని, ఐరోపాకు ఎగుమతి చేయడానికి లేదా జపాన్‌లో ప్రత్యేక కార్యక్రమాల కోసం దీనిని తయారు చేసి ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు దీని మూలాలపై విస్తృత పరిశీలనలు జరగలేదని చెప్పారు.
ప్రస్తుతం మమ్మీని మంచి స్థితిలో ఉంచడానికి ఉపయోగించే క్రిమినాశక చికిత్సను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలాగే వస్తువు దేనితో తయారు చేయబడిందో తెలుసుకోవడానికి డీఎన్ఏ అధ్యయనాన్ని నిర్వహిస్తారు. అయితే పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిగాకే పూర్తి స్థాయిలో వివరాలు తెలుస్తాయని చెప్పారు.