మణిపూర్ బీజేపీ శాసన సభాపక్ష నేతగా సీనియర్ నాయకులు ఎన్.బీరెన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు మణిపూర్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మణిపూర్ బీజేపీ శాసన సభాపక్ష నేత ఎన్నికను ఆదివారం నిర్వహించారు. పార్టీ కేంద్ర పరిశీలకులు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజీజు సమక్షంలో ఈ ఎన్నికను నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసన సభా పక్ష నేతగా బీజేపీ సీనియర్ నేత బీరెన్ సింగ్ ను పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఆయనకు కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘ బీజేపీ మణిపూర్ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైనందుకు సీనియర్ నాయకులు బీరెన్ సింగ్ కు శుభాకాంక్షలు. ప్రధాని మోడీ విజన్ ప్రకారం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు మరింత అభివృద్ధిని మణిపూర్ చూస్తుంది” అని ట్వీట్ లో పేర్కొన్నారు.