మహిళా జర్నలిస్టుకు అనుచితమైన వాట్సాప్ స్టిక్కర్లు పంపి విమర్శలు పాలయ్యారు ఐఏఎస్ అధికారి ప్రశాంత్. కేరళలో పనిచేస్తున్న ఆయన్ను.. మహిళా జర్నలిస్టు ఓ వార్త కోసం వాట్సాప్ లో మెసేజ్ చేసింది. ఫ్రీగా ఉంటే మాట్లాడతారా..? అని అడిగింది. దానికి ఆయన ఎగతాళి చేస్తున్నట్లుగా ఉన్న స్టిక్కర్ ను రిప్లై ఇచ్చాడు. అది అర్థంకాక ఆ మహిళా జర్నలిస్టు.. మీరేం చెబుతున్నారో అర్థం కావడం లేదని అడిగింది. దానికి బదులుగా ప్రశాంత్.. ఓ నటి వీపు చూపిస్తున్నట్లుగా ఉన్న స్టిక్కర్ ను పంపాడు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పగా.. కొందరు జర్నలిస్టులను రోడ్లు ఊడ్చే వాళ్లతో పోల్చడంలో తప్పేలేదని అన్నాడు. ప్రశాంత్ చేసిన పనిపై కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం తీవ్రంగా స్పందించింది. సీఎం పినరయి విజయన్ కు లేఖ రాసింది. ప్రశాంత్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో ప్రశాంత్ పై కేసు నమోదైంది. ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగినా.. న్యాయ సలహాల తర్వాత పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.