ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తెలుగు వారి కల నిజమైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతూ వచ్చింది. హాలీవుడ్ అభిమానుల హృదయాలను సైతం దోచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 130 కోట్ల మంది గుండెలు గర్వించేలా ప్రతి తెలుగోడు ఆనందపడేలా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది.
మన ‘నాటు నాటు’ పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డు ప్రకటించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. ది అవార్డ్ గోస్ టు ‘నాటు నాటు’ అని చెప్పగానే అక్కడ ఉన్న రాజమౌళి, కీరవాణి, రాంచరణ్, ఎన్టీఆర్ సంబరాల్లో మునిగిపోయారు. అసలు తెలుగు సినిమా ఆస్కార్ వరకు చేరుకోవడం సాధ్యమేనా అనే పరిస్థితి నుంచి ఆస్కార్స్ కి నామినేట్ కావడం మాత్రమే కాదు అవార్డు గెలిచి చూపించారు.
టాప్ గన్ మేవెరిక్ చిత్రం నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’..టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ చిత్రం నుంచి ‘అప్లాజ్’.. ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ అల్ ఎట్ వన్స్ చిత్రం నుంచి ‘థిస్ ఈజ్ ఏ లైఫ్’ .. బ్లాక్ పాంథర్ వాకండా ఫారెవర్ చిత్రం నుంచి ‘లిఫ్ట్ మీ అప్’ పాటలు నాటు నాటు సాంగ్ కి పోటీగా నిలిచాయి. వీటిని అధిగమిస్తూ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి వేదికపై అవార్డు అందుకున్నారు.
నాటు నాటు సాంగ్ మొదట లిరికల్ వీడియో విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. జపాన్, చైనా, అమెరికా , ఇంగ్లాండ్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఫిదా అవుతూ ఈ పాటకి మ్యూజిక్ రీల్స్ చేశారు. ఈ పాట ఆస్కార్ అవార్డు సాధించింది అంటే రాజమౌళి, కీరవాణి తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, లిరిక్స్ అందించిన చంద్రబోస్, గాత్రం అందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గురించి కూడా చెప్పుకోవాల్సిందే.
వీరితో పాటు ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా ఓ కారణమనే చెప్పవచ్చు. రాంచరణ్, ఎన్టీఆర్ ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇద్దరూ తమ డ్యాన్స్ మూమెంట్స్ లో చిన్న తేడా కూడా లేకుండా పర్ఫెక్ట్ సింక్ తో డ్యాన్స్ చేశారు. ఆర్ఆర్ ఆర్ చిత్రానికి అంతర్జాతీయంగా వస్తున్న రెస్పాన్స్ గమనించిన జక్కన్న రాజమౌళి.. ఈ చిత్రానికి ఆస్కార్ సాధించే సత్తా ఉందని గట్టిగా నమ్మారు. ఇండియా తరఫున ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ కాలేదు. అయినా రాజమౌళి నిరాశ పడలేదు. తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేశారు. ఫలితంగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక కావడం మాత్రమే కాదు.. అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది.