ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ కు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పరిపాలనకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలని నాగబాబు ట్వీట్ చేశారు. ఉద్యోగులు జీతాలు, బకాయిల కోసం చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్నారు.
డీఏ, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక, ఆందోళన చేయడానికి అనుమతివ్వక, ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలున్న గవర్నర్ కు మొర పెట్టుకునే స్థితికి తీసుకొచ్చారని నాగబాబు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ నాగబాబు చురకలు అంటించారు. వైసీపీ అసమర్థ పరిపాలనకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? అని ప్రశ్నించారు.
కాగా ఈ నెల 21, 22 తేదీల్లో నాగబాబు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21న కర్నూలు జిల్లా వీరమహిళల సభలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం జనసైనికుల సభకు హాజరవుతారు. ఈ నెల 22న అనంతపురం జిల్లాలో వీరమహిళలు, జనసైనికుల సభల్లో పాల్గొననున్నారు.