నాగచైతన్య హీరోగా నటించిన సినిమా థాంక్యూ. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది. వచ్చే శుక్రవారం సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. అయితే.. ట్రైలర్ చూసిన చాలామంది ఇది ప్రేమమ్, మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ తరహాలో ఉందని అన్నారు. దీనిపై స్పందించిన దర్శకుడు విక్రమ్ కుమార్.. ఆ సినిమాల స్టయిల్ లోనే ఉన్నప్పటికీ కథ వేరే అంటున్నాడు.
ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై నాగచైతన్య స్పందించాడు. విక్రమ్ చెప్పిన పోలికతో కూడా విభేదిస్తున్నాడు ఈ హీరో. ఆ రెండు సినిమాలతో థాంక్యూను పోల్చొద్దని కోరుతున్నాడు. ఇది పూర్తిగా ఓ కొత్త కథ అని చెబుతున్నాడు.
“చాలామంది ట్రైలర్ చూసి ప్రేమమ్ లా ఉందంటున్నారు. మరికొందరు ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ గుర్తొస్తుందని చెబుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. థాంక్యూ సినిమా వేరే లెవెల్. 3 వయసుల గెటప్స్, ముగ్గురు హీరోయిన్లు ఉండడం వల్ల చాలామంది అలా అనుకుంటున్నారు కానీ.. ఈ సినిమాకు, గత సినిమాలతో పోలిక లేదు. ఇదొక యూనిక్ కాన్సెప్ట్.”
ప్రేమమ్ లాంటి కథ అయితే తను మరోసారి ఎందుకు నటిస్తానని ప్రశ్నిస్తున్నాడు నాగచైతన్య. ప్రేమమ్ లో తను టీనేజ్ కుర్రాడిలా కనిపించానని, థాంక్యూలో కూడా టీనేజ్ లుక్ ఉందని.. అంతమాత్రాన రెండు సినిమా కథలు ఒకటి ఎలా అవుతాయని అంటున్నాడు.
ఈ సినిమా పాయింట్ చాలా ప్రత్యేకతమైనదని, అది నచ్చి నటించానని చెబుతున్న నాగచైతన్య.. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్సుల్లో థాంక్యూ ఒకటిగా నిలిచిపోతుందంటున్నాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది.