మల్టీస్టారర్ సినిమా హిట్టయినప్పుడు అందులో నటించిన హీరోలిద్దరూ ఆ సక్సెస్ క్రెడిట్ ను సమానంగా తీసుకుంటారు. హిట్ అనేది ఆ ఇద్దరు హీరోలకు చెందుతుంది. కానీ బంగార్రాజు విషయంలో మాత్రం అలా జరగదంటున్నాడు నాగచైతన్య. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం నాగార్జునకే దక్కుతుందని చెబుతున్నాడు. అక్కడితో ఆగకుండా, బంగార్రాజు విజయాన్ని నాగార్జునకు అంకితం చేశాడు చైతూ.
నిన్న రిలీజైన బంగార్రాజు సినిమాకు ఎబోవ్ యావరేజ్ టాక్ వచ్చింది. మరో సినిమా బరిలో లేకపోవడంతో సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేశాడు నాగార్జున. సినిమాలో టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. నాగచైతన్యకు కూడా కంగ్రాట్స్ చెప్పాడు. అయితే చై మాత్రం ఆ క్రెడిట్ తీసుకోలేదు.
“ఈ సినిమా కథ విన్నప్పట్నుంచి, సినిమా కంప్లీట్ అయ్యేవరకు ఒకే ఎనర్జీతో పనిచేశారు నాగార్జున. ఆయన మా అందర్లో ఎనర్జీ నింపారు. ఈ కథను ఆయన బలంగా నమ్మారు. మేమంతా ఇంత బాగా చేశామంటే, ఇంత తక్కువ టైమ్ లో సినిమా పూర్తయిందంటే దానికి కారణం నాన్నే. కాబట్టి బంగార్రాజు విజయం ఆయనకే సొంతం. ఈ విజయాన్ని నాన్నకు అంకితం చేస్తున్నాను.”
ఇలా బంగార్రాజు విజయాన్ని తండ్రికి అంకితం చేశాడు నాగచైతన్య. పక్కనే ఉన్న నాగ్, కొడుకు మాటతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు సినిమాకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.