నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీకి ఇక్కడి నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ పెద్ద షాకే ఇచ్చింది. క్రిస్టియన్లకు వ్యతిరేకంగా పని చేసే శక్తులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చింది. ఈ రాష్ట్రంలో ఈ కౌన్సిల్ కి పెద్ద సంఖ్యలో క్రిస్టియన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీని కింద గల అన్ని చర్చిలకు ఈ సందేశం పంపుతున్నామని ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ జెల్ హౌ తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సమస్యలపట్ల సానుకూలంగా స్పందించేవారికే ఓటు వేయాలని, క్రైస్తవులకు వ్యతిరేకంగా పని చేసే శక్తులను దూరంగా ఉంచాలని తాము కోరుతున్నట్టు ఆయన చెప్పారు.
ఇండియాలో క్రిస్టియన్లను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. చర్చిల పట్ల నిరాదరణ చూపుతున్నారన్నారు. క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగేలా చూడాల్సి ఉందని, ఈ ఎన్నికల్లో క్రైస్తవులు ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కోరుతున్నామని అన్నారు. రాష్ట్రంలో పాలక నేషనల్ డెమొక్రటిక్ పీపుల్స్ పార్టీ-బీజేపీ కూటమిని ఉద్దేశించి బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ ఈ పిలుపునిచ్చినట్టు కనబడుతోంది.
ఈ పిలుపుతో ముఖ్యంగా బీజేపీ డిఫెన్స్ లో పడింది. రాష్ట్రంలోని క్రిస్టియన్లను తామే బుజ్జగించాలని చూస్తున్న తరుణంలో చర్చి కౌన్సిల్ ముందే తమ వర్గాన్ని ఆకట్టుకుంటోందని ఈ పార్టీ ఇరకాటంలో పడింది. వచ్చేవారం ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్టంలో 89 శాతం మంది క్రిస్టియన్లే ఉన్నారు. అయితే తాము క్రైస్తవులకు వ్యతిరేకం కాదని ఇక్కడి బీజేపీ అధికార ప్రతినిధి కుపుటో షోహే అంటున్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో 60 సీట్లకు గాను తమ పార్టీ 12 స్థానాలను గెలుచుకుందన్నారు. అంతకుముందు మా పార్టీకి ఇక్కడ ఉనికే లేదన్నారు.
ఇక ఎన్నికల ప్రచారంలో బీజేపీ క్రిస్టియన్ గుర్తులను వినియోగించుకోవడాన్ని బాప్టిస్ట్ చర్చ్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణిస్తోంది. కేంద్ర మంత్రి జాన్ బర్లా ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి చేతిని పట్టుకుని ‘ప్రైజ్ ది లార్డ్’ అంటూ నినాదాలు చేయడాన్ని ఈ కౌన్సిల్ తప్పు పట్టింది. కానీ బీజేపీ నేతలు మాత్రం తాము ఎలాంటి వివాదాల జోలికి వెళ్లడం లేదని చెబుతున్నారు.