నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా వచ్చి దాదాపుగా ఆరు దశాబ్దాలు గడుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క మహిళా కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. తాజాగా హెకానీ జకాలు చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డు సృష్టించారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో కేవలం నలుగురు మహిళలు మాత్రమే బరిలో ఉన్నారు. వారిలో హెకానీ విజయం సాధించారు. దిమాపూర్-3వ నియోజవర్గం నుంచి బీజేపీ మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ నుంచి ఆమె బరిలోకి దిగారు.
లోక్ జనశక్తి పార్టీ అజెతో జిమామీపై ఆమెపై ఘన విజయం సాధించారు. జకాలు(48) వృత్తి రీత్యా న్యాయవాది. రాష్ట్రంలో ఆమె సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తోంది. ఎన్‌డీపీపీ నుంచి మరో మహిళా అభ్యర్థి సల్హౌటు యోనువో క్రూసే పశ్చిమ అంగామీ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.
నాగాలాండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్‌డీపీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమి ఇప్పటి వరకు 15 స్థానాల్లో విజయం సాధించింది. మరో 21 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.