దసరా బరిలో గాడ్ ఫాదర్ కు పోటీగా వచ్చింది ది ఘోస్ట్ సినిమా. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత నుంచి సినిమా పడిపోయింది. ఇక నిన్నటితో ఈ సినిమా ఫ్లాప్ అనే విషయం క్లియర్ గా అర్థమైంది.
శుక్రవారం ఎకాఎకిన 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటి కోసం గాడ్ ఫాదర్ కంటే, ఘోస్ట్ సినిమా థియేటర్లనే ఎక్కువగా తొలిగించాల్సి వచ్చింది. స్వాతిముత్యం సినిమా ఎలాగూ లిమిటెడ్ స్క్రీన్స్ లోనే రిలీజైంది. ఇలా నిన్న రిలీజైన సినిమాలతో ఘోస్ట్ మూవీ దాదాపు 50శాతం థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా, నాగ్ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచింది.
నిజానికి ఈ సినిమా విడుదలైన మూడో రోజుకే ఫ్లాప్ అయ్యింది. మొదటి రోజు ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత వీకెండ్ లో ఇంకొంత రెవెన్యూ వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా చతికిలపడింది. అలా సోమవారం నుంచి పూర్తిగా డౌన్ అయిన ఈ సినిమా, శుక్రవారానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మేరకు థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ఘోస్ట్. చెప్పినట్టుగానే సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగానే చూపించారు. కాకపోతే సరైన కథలేక, ఎమోషన్ పండక సినిమా ఫ్లాప్ అయింది.