నాగార్జునసాగర్ నీళ్లలో విషం ఉందా…? సాగర్‌లో ఉన్న నీళ్లే కాదు చేపలు కూడా ప్రాణాంతకమా…? మరీ సాగర్ నీళ్లు తాగుతోన్న ప్రజల సంగతేంటీ…? ఇప్పుడివే ప్రశ్నలు సాగర్ ప్రజలనే కాదు, హైదరాబాద్ ప్రజల్లో భయానికి కారణమవుతున్నాయి.
నాగార్జున సాగర్‌లో నీళ్లే హైదరాబాద్ జంట నగరాల దాహార్తి తీరుస్తుంటాయి. నగరానికి మంజీరా నీళ్లు రావటం ఆగిపోయాక… సాగర్‌లోని కృష్ణా నీళ్లే ఆధారమయ్యాయి. సాగర్ అడుగంటిపోతున్న సందర్భంలో ఎల్లంపల్లి నుండి గోదావరి నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పుడు సాగర్ నీళ్లు ఎంతవరకు సేఫ్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఈ భయానికి కారణం యురేనియమే. అవును… నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా యురేనియం నిక్షేపాలున్నాయని అధికార వర్గాల దగ్గర సమాచారం ఉంది. శ్రీశైలం నుండి సాగర్ వరకు… యురేనియం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయనే నల్లమలను తొవ్వేందుకు కేంద్రం రెడీ అయింది. అయితే, సాగర్ జలాశయం వద్ద యురేనియం నిక్షేపాల… నీటి ఊట ద్వారా జలాశయం నీటిలోకి చేరుతున్నాయని, అందుకే అక్కడి చేపలు తినకూడదని ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
స్థానికంగా దొరుకుతున్న చేపల్లో యురేనియం ఎక్కువగా ఉందని, సాధారణ నీటిలో 30పీపీబీ యురేనియం మూలకాలు ఉంటే… సాగర్ పరిసరాల్లోని బోర్లలో 2618పీపీబీ వరకు ఉన్నట్లు గుర్తించారు. అంటే… ఉండాల్సిన దాని కన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసానికి కారణం… భూపోరల్లో ఉన్న భారీ యురేనియం నిక్షేపాలనే అధికారులు భావిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ వార్తపై రాష్ట్ర పర్యావరణవెత్తలు, మంచి నీటి సరఫరా అధికారులు, మత్స్యశాఖ అధికారులు స్పందిస్తే తప్ప సాగర్ నీటిపై వస్తోన్న ఆరోపణలకు చెక్ పడేలా లేదు.