2017లో ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చిన స్వాతి గుర్తుందా కదా..? అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స్వాతికి నాగర్ కర్నూల్ కోర్టు తాజాగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 2017 లో జరిగిన కేసులో మళ్లీ రిమాండ్ ఏంటనేగా మీ సందేహం..?
Advertisements
నాగర్ కర్నూలుకు చెందిన స్వాతి, సుధాకర్ రెడ్డి భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. సుధాకర్ రెడ్డి వ్యాపారంలో నిత్యం బిజీగా ఉండేవాడు. స్వాతికి నడుం నొప్పి వస్తుండడంతో నాగర్ కర్నూల్ కే చెందిన ఫిజియోథెరపిస్ట్ రాజేష్ తో ఫిజియోథెరపీ చేయించుకునేది. ఈ క్రమంలోనే స్వాతికి రాజేష్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడి మోజులో పడిన స్వాతి భర్త సుధాకర్‌రెడ్డిని హతమార్చేందుకు రాజేష్ తో స్కెచ్ వేసింది. ప్రియుడు రాజేష్‌తో కలిసి నాగర్‌కర్నూల్‌లోని తన ఇంట్లోనే సుధాకర్‌రెడ్డిపై దాడి చేసి చంపేశారు. డెడ్ బాడీని కారులో తీసుకెళ్లి నవాబుపేట సమీపంలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఆ తర్వాత రాజేష్ నే తన భర్త సుధాకర్ రెడ్డిగా నమ్మించేందుకు ఓ డ్రామా ఆడారు. రాజేష్ ముఖంపై యాసిడ్ పోసుకొని మొహానికి బ్యాండేజ్ లు కట్టుకొని హాస్పిటల్లో చేరాడు. అతడే సుధాకర్‌రెడ్డిగా నమ్మించే ప్రయత్నం చేశారు. తన కుమారుడు హాస్పిటల్లో చేరారని తెలుసుకున్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు, స్వాతి తల్లిదండ్రులు హాస్పిటల్ కు వచ్చారు. అయితే ముఖానికి బ్యాండేజ్ లు కట్టుకోవడంతో కొద్ది రోజుల వరకు ముఖం గుర్తు పట్ట లేక పోయారు. రాజేష్ ను తన భర్తగా నమ్మిస్తున్న స్వాతి అతని ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తుండగా…డాక్టర్లు మాత్రం ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా హాస్పిటల్లో ఉండి సుధాకర్ రెడ్డిగా నటిస్తోన్న రాజేష్ తీరుపై సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. స్వాతి అనుమానస్పద ప్రవర్తన కూడా సుధాకర్ రెడ్డి తల్లిదండ్రుల అనుమానానికి బలం చూకూర్చింది. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి తమ కుమారుడు కాదని గ్రహించిన సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయమంతా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అయితే ఈ కేసులో స్వాతికి బెయిల్ మంజూరు అయినా కొన్ని రోజుల వరకు తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ ఆమెను తీసుకెళ్లడానికి రాకపోవడంతో మహబూబ్ నగర్ స్టేట్ హోం లో ఉంటుంది. ఇదే కేసుకు సంబంధించి గత నెల 31న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ స్వాతి హాజరు కాలేదు. దీంతో కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణిస్తూ న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాగర్ కర్నూలు కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా స్వాతికి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితురాలని మహబూబ్ నగర్ జైలుకు తరలించారు.