ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఆగిపోతుంటాయి. అలా ఆగిన సినిమాలు మళ్లీ తెరపైకి రావడం చాలా కష్టం. ఇక ఆ ప్రాజెక్టును మరిచిపోవాల్సిందే. కానీ కొన్ని సినిమాలుంటాయి, అవి ఆగిపోయిన మాట నిజమే కానీ మళ్లీ ఏదో ఒక టైమ్ లో సెట్స్ పైకి వస్తుందని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇది అలాంటి సినిమానే. నాగశౌర్య హీరోగా నటిస్తున్న మూవీ ఇది.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా చాన్నాళ్ల కిందట ఓ సినిమా మొదలైంది. పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమా లాంఛ్ అయిందో కానీ, అప్పట్నుంచి అన్నీ దీనికి అడ్డంకులే. అలా ఏళ్ల తరబడి ఆగిపోయింది ఈ ప్రాజెక్టు. మధ్యలో నాగశౌర్య 3 సినిమాలు చేసి, ఆ మూడింటినీ రిలీజ్ కూడా చేశాడు.
అలా ఆగిపోయిన అవసరాల-శౌర్య ప్రాజెక్టుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తోంది. ఇంతకీ ఈ సినిమాకు ఎదురైన ప్రధానమైన అడ్డంకి ఏంటో తెలుసా?
కథ ప్రకారం, సినిమాలో కొంత భాగాన్ని అమెరికాలో షూట్ చేయాలి. కానీ యూనిట్ లోని కీలకమైన వ్యక్తులు కొందరికి వీసాలు రాలేదు. ఆ టెక్నికల్ సమస్యలు రేపోమాపో క్లియర్ అవ్వబోతున్నాయి. ఆ వెంటనే సినిమా యూనిట్ అమెరికా వెళ్లి బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని చెబుతున్నాడు శౌర్య