నాగోల్ లో బంగారం షాపులో కాల్పులు జరిపి బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా.. పక్కా స్కెచ్ తో దొంగలు ప్లాన్ వేసినా.. సైంటిఫిక్ ఆధారాలతో తీగ లాగితే డొంక కదిలింది. పోలీసులకు దొంగలు దొరికేశారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే.. మహారాష్ట్రలో ఉన్న ముగ్గురు దొంగల ఆచూకీ లభ్యమైంది.
పోలీసులు ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకోవడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం సాధ్యపడింది. అయితే ఈ నెల 1 వ తేదీన రాత్రి 9 గంటల ప్రాంతంలో నాగోల్ స్నేహపురి కాలనీలోని మహదేవ్ జువెలరీ షాపులో దొంగలు పడ్డారు. కాల్పులు జరిపి భయాందోళనకు గురి చేసి.. తరువాత బంగారాన్ని దోచుకెళ్లారు. దొంగల కాల్పుల్లో షాప్ ఓనర్ కల్యాణ్ , బంగారం వ్యాపారి సుఖ్ రామ్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకునే లోపే దొంగలు బంగారంతో పరారయ్యారు.
అయితే ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. దీని కోసం 15 టీమ్ లు తీవ్రంగా శ్రమించాయి. కాల్పులు జరిగిన తర్వాత ఎటువంటి క్లూ వదల కుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. రెండు బుల్లెట్ బైకులపై నిందితులు వచ్చారన్న ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో కేసు దర్యాప్తు చేపట్టారు.
అయితే హైదారాబాద్ లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగి ఉండడంతో అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానించి.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టడంతో.. దొంగలు దొరికేశారు.