నాగ్ పూర్-పూణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొనగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
పూణే నుంచి మెహెకర్ వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొన్నట్టు తెలుస్తోంది. గాయపడినవారిని పోలీసులు, స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో బస్సు కిటికీ అద్దాలు పగిలిపోగా.. లోపలి సీట్లన్నీ చిరిగిపోయాయి. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో రెండూ దాదాపు నుజ్జునుజ్జయ్యాయి. బస్సుతో బాటు ట్రక్కుకు చెందిన గ్లాస్ ప్యానల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మహారాష్ట్ర లోని అమరావతి జిల్లా లోనూ జరిగిన ఇదే తరహా యాక్సిడెంట్ లో అయిదుగురు మరణించారు. ఏడుగురు గాయపడ్డారు. ఓ ట్రక్కు కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో కొందరు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది. దర్యాపూర్-అంజన్ గావ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.