బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకునేందుకు ఓ యువతి ఆడిన డ్రామా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఫేక్ కంప్లైంట్ ఇచ్చింది ఆ యువతి. అది నిజమేనని నమ్మిన పోలీసులు ఆరు గంటల పాటు ఉరుకులు పరుగులు పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్ పూర్ కు చెందిన ఓ యువతి కలమ్నా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసింది. అడ్రస్ కనుక్కునే నెపంతో తన దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఓ వ్యాన్ లో కిడ్నాప్ చేశారని చెప్పింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు స్టేషన్ కు చేరుకున్నారు. బాధితురాలితో మాట్లాడారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో 40 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిటీలోని 250 సీసీటీవీల ఫుటేజ్ ను పరిశీలించారు. బాధితురాలిని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం హాస్పిటల్ కు పంపారు. ఇలా ఆరు గంటల పాటు కష్టపడి 50 మందిని విచారించారు. అయినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఎక్కడెక్కడకు వెళ్లిందన్న విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించారు. అవన్నీ చూసిన తర్వాత ఆమె కట్టుకథ అల్లిందని నిర్థారించుకున్నారు. యువతిని గట్టిగా ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. అత్యాచారం జరగలేదని.. తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకునేందుకు తన కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఈ డ్రామా ఆడినట్లు చెప్పింది. ఆ మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు.