టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం చూస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. పాదయాత్ర నిర్వహించడం కోసం సుమారు 20 రోజుల క్రితమే అనుమతి అడిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని…దీన్ని బట్టే రాష్ట్ర డీజీపీ తీరు ఏంటి అనేది తెలుస్తోంది అంటూ ఆయన విమర్శలు కురిపించారు.
తమ నాయకుడు లోకేష్ ఎక్కడ ఉండేది, ఎవరిని కలిసేది ముందుగానే ప్రభుత్వానికి చెప్పమనడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీకి భజన చేస్తున్న పోలీసు అధికారులు అందరూ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు.
ప్రజాస్వామ్యయుతంగా పోలీసులు పని చేయాలని సూచించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో రాష్ట్రంలో యువతను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. యువత ఎదురు ప్రశ్నించకుండా మత్తులో ముంచి మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా చేసేందుకు జీవో 1 తెచ్చారన్నారు. కందుకూరు గుంటూరు తొక్కిసలాటకు ప్రభుత్వమే కారణమని, ఆ సాకుతో టీడీపీ కార్యక్రమాలు అడ్డుకోవాలని చూస్తున్నారని నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు.