యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చిన నల్లగొండ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దోషి శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది.
హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అదే గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా, కల్పన అనే బాలికలపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి తన పొలం సమీపంలోని పాడుబడ్డ బావిలో మృతదేహాలను పాతిపెట్టాడు. తమ గ్రామం నుంచి వేరే గ్రామానికి స్కూలు కు వెళ్లిన విద్యార్ధులను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన బండిపై తీసుకెళ్తానంటూ ఎక్కించుకొని తీసుకెళ్లి అత్యాచారం చేసే వాడు. ఆ తర్వాత హత్య చేశాడు. శ్రీనివాసరెడ్డి ముగ్గురు బాలికలను వేర్వేరుగా హత్య చేశాడు. చాలా సంవత్సరాలు ఈ విషయం బయటకు తెలియలేదు. చివరి సారిగా ఓ అమ్మాయి కేసులో శ్రీనివాసరెడ్డిని అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా విషయమంతా చెప్పాడు. ఎంత మంది అమ్మాయిలపై అత్యాచారం చేశాడో వెల్లడించాడు. మృతదేహాలు పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. మృతదేహాలను పాతిపెట్టిన స్థలంలో పోలీసులు అస్థిపంజరాలు, ఎముకలను వెలికి తీశారు.
అతనిపై మూడు అత్యాచారాలు, హత్య కేసులు వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఫోక్సో చట్టంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ జరిపిన నల్లగొండలోని ఫోక్సో స్పెషల్ కోర్టు శ్రీనివాసరెడ్డిని దోషిగా తేల్చి ఉరిశిక్ష ఖరారు చేసింది.