బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్గొండ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచారని భావోద్వేగానికి గురయ్యారు అనిల్ కుమార్. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. అవసరమైతే నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా అధిష్టానానికి పంపించారు అనిల్ కుమార్.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని అనిల్ కుమార్ ఆశించారు. ఎమ్మెల్సీ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆయన రాజీనామా చేశారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, పార్టీ విస్తరణలో చకిలం అనిల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. గులాబీ పార్టీలో 22 ఏళ్లుగా పనిచేశారు అనిల్ కుమార్. ప్రతి ఎన్నికల్లో కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్ ఆశించడం.. ఆ తర్వాత నిరాశ చెందడం సాధారణంగా మారింది.
గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపించిన పక్షంలో.. ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి పిలిపించుకొని హామీ ఇస్తానని చెప్పడంతో, ఆయన ఆ ఎన్నికల్లో కంచర్ల గెలుపు కోసం పనిచేశారు. అయితే ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకపోవడంతో.. తీవ్ర నిరాశకు గురైన అనిల్ కుమార్.. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో సదస్సులు, తన తండ్రి దివంగత చకిలం శ్రీనివాసరావు పంతులు శత జయంతి సదస్సుల ద్వారా ఎమ్మెల్సీ పదవి సాధన దిశగా అనిల్ కుమార్ అధిష్టానంపై ఒత్తిడి పెంచిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మాత్రం మరోసారి కూడా ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో అనిల్ కుమార్ పేరును పరిశీలనలోకి తీసుకోకపోవడంతో తనకు ఇక బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదని భావించినట్లుగా తెలుస్తోంది.
గులాబీ పార్టీకి రాజీనామా చేసిన చకిలం అనిల్ కుమార్ ఏ పార్టీలో చేరనున్నారన్నది సస్పెన్స్ గా ఉంది. నియోజకవర్గ రాజకీయాల్లో పట్టున్న చకిలం కుటుంబం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.