క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కొన్ని సార్లు ప్రాణాలనే మింగేస్తాయి. చిన్న చిన్న సంఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆవేశంలో తనువు చాలించాలన్న ఆలోచన పెను విషాదాన్ని మిగుల్చుతుంది. వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని ఇస్తుంది.
ఇలాంటి సంఘటనే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు గ్రామంలో చోటుచేసుకుంది. నీళ్ల నల్లా దగ్గర జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య చేసుకుంది. రోజులాగే నీళ్ల కోసం కుళాయి దగ్గరకు వెళ్ళిన వైష్ణవితో శోభ అనే మహిళ గొడవకు దిగింది. అయితే చిన్న గొడవ చిలికి చిలికి పెద్దదైంది. శోభతో పాటు సురేష్ అనే వ్యక్తి కూడా గొడవకు దిగాడు.
ఈ విషయం కాస్త పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. శోభ, సురేష్ ఇద్దరు వైష్ణవి పై కేసు పెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరు అందరి ముందు గొడవకు దిగడంతో పాటు వ్యవహారం కాస్త పోలీసు స్టేషన్ వరకు వెళ్లడంతో ఇంటర్ చదువుతున్న వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురైంది. పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడంతో.. స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుందని.. పోలీసుల భయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
అంతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. తన చావుకు శోభ, సురేష్ కారణం అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. దీంతో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శోభ, సురేష్ లను విచారిస్తున్నారు. అయితే తమ బిడ్డ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వైష్ణవి తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు.