టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదేలును, ఆయన భార్య భాగ్యలక్ష్మిని అగ్రనేత ప్రియాంకగాంధీ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. చేరిక అనంతరం రేవంత్ రెడ్డి, ఓదేలు మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ పాలనను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఓదేలు కుటుంబాన్ని ప్రియాంక గాంధీ సాదరంగా స్వాగతం పలికారని చెప్పారు. వారికి సముచితమైన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. తెలంగాణలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న ఆయన.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేసీఆర్ అవినీతికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను పక్కకు పెట్టడం వల్ల ఆదిలాబాద్ కు 2 లక్షల ఎకరాలకు నీరు అందడం లేదని మండిపడ్డారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ వల్లే సాధ్యమౌతుందని తెలిపారు.
ఇక ఓదేలు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా.. సముచిత స్థానం కల్పిస్తారని ఎదురుచూశానని.. కానీ.. కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ఫోన్ ట్యాప్ చేశారని.. తమ ఇంటిపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఆయన అరాచకమైన చర్యలు చేయడం వల్లే టీఆర్ఎస్ ను వదిలిపెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి వర్గంలో ఉద్యమద్రోహులకే పట్టం కట్టారన్న ఆయన.. సోనియా, రాహుల్ నాయకత్వంలో ప్రియాంక గాంధీ చేతులమీదుగా కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. తన భార్య జెడ్పీ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిందని వివరించారు.
జెడ్పీ చైర్ పర్సన్ అయినా కూడా తనకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని ఆరోపించారు భాగ్యలక్ష్మి. బాల్క సుమన్ అన్నింటిలో కలగజేసుకుని ఇబ్బందులు పెట్టినట్లు తెలిపారు. ప్రజలకు ఏం చేయలేకపోయామనే బాధతో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరానని వివరించారు.