పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి మే 28 వ తేదీని ఎంచుకోవడం పట్ల మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరం ప్రకటించారు. ఆ రోజు వీడీ సావర్కర్ జయంతి రోజు గనుకే ఈ తేదీని ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోడీ జాగ్రత్తగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని సెటైర్ వేశారు. దీనికి ‘సావర్కర్ సదన్
‘ అని పేరు పెట్టుకోవాలని, అలాగే పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు ‘క్షమా కక్ష’ అని నామకరణం చేయాలని అన్నారు.
ఇందుకు కారణం.. నాడు సావర్కర్ బ్రిటీషర్లకు ఆరు సార్లు క్షమాపణ చెప్పుకున్న విషయం మరువరాదన్నారు. సావర్కర్ ఆ నాడు చేసిన పనిని దేశం గుర్తుంచుకుంటుంది కూడా అని ఆయన ఎద్దేవా చేశారు. సావర్కర్ జయంతి నాడే ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారని విపక్ష నేతలు కూడా ప్రశ్నించారు.
అండమాన్ జైల్లో సావర్కర్ శిక్ష అనుభవిస్తున్నప్పుడు తనను క్షమించవలసిందిగా బ్రిటిష్ పాలకులకు.ఆరు సార్లు లేఖలు రాశారన్నారు. ఇక ఈ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలకు డిజిటల్ గా కూడా ఆహ్వానాలను పంపారు.
అలాగే అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు సైతం ఇన్విటేషన్లను పంపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త భవన చీఫ్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా వంటివారిని కూడా ఆహ్వానించినట్టు ఈ వర్గాలు వివరించాయి.