– ప్రగతి భవన్ ముట్టడికి వైటీపీ ప్రయత్నం
– షర్మిలను అడ్డుకున్న పోలీసులు
– పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితులు
– షర్మిల సహా ఆరుగురిపై కేసులు
– వైద్య పరీక్షలు.. నాంపల్లి కోర్టులో హాజరు
– లోటస్ పాండ్ లో విజయలక్ష్మి దీక్ష
– బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం
వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం జరిగిన దాడికి నిరసనగా.. షర్మిల ఈ నిరసనకు పిలుపునిచ్చారు. అయితే.. మార్గమధ్యంలోనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ధ్వంసమైన కారులోనే షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా.. పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు షర్మిలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా.. కారులోనే కూర్చుని ఉండిపోయారు.
ప్రజా సమస్యలపై పోరాడుతుంటే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పోలీసులు ఆమెను కారులో నుంచి దించే ప్రయత్నం చేయగా.. కిటికీలు మూసేసి ఎంతకూ బయటకు రాలేదు. డ్రైవింగ్ సీట్లో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్ ను తెప్పించి అక్కడి నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే సమయంలో పీఎస్ ఎదురుగా ఉన్న భవనం ఎక్కి వైటీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగించారని పలు సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్ విషయం తెలిసిన ఆమె భర్త పీఎస్ కు వెళ్లారు. అయితే.. ఆమె తల్లి విజయలక్ష్మిని మాత్రం లోటస్ పాండ్ దాటనీయలేదు. దీంతో ఆమె అక్కడే దీక్షకు కూర్చున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అమీర్ పేట్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు అక్కడకు వచ్చి పరీక్షలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే.. న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో విజయలక్ష్మి దీక్ష విరమించారు.
మరోవైపు పాదయాత్రకు అనుమతివ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు వైటీపీ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనుమతివ్వాలని పోలీసులను ఆదేశించింది. కానీ, సీఎం కేసీఆర్ పై మతపరమైన, రాజకీయ అంశాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.