సంచలనం రేపిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ కు కూడా బెయిల్ వచ్చేసింది. న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ మధ్యే మిగిలిన ఐదుగురు నిందితులకు బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే సాదుద్దీన్ ప్రయత్నించగా తిరస్కరించింది కోర్టు. కానీ.. తాజాగా అనుమతించింది.
మే 28న అమ్నేషియా పబ్ లో మైనర్ బాలికను వేధించారు టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు. వారి గోల భరించలేక పబ్ బయటకు వచ్చిన బాలికను ట్రాప్ చేసి తమ కారులోకి ఎక్కించుకున్నారు. తర్వాత ఓ బేకరీ దగ్గరకు వెళ్లారు. దారిలో ఎమ్మెల్యే కుమారుడు సహా ఐదుగురు బాలికను వేధించారు.
బేకరీ నుంచి పెద్దమ్మతల్లి గుడి దగ్గరలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. అయితే.. అత్యాచార సమయంలో ఎమ్మెల్యే కుమారుడు లేడని పోలీసులు చెప్పారు. అంతకుముందు బాలికను వేధించిన కేసులో మాత్రం అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యే కుమారుడితోపాటు మరో నలుగురు మైనర్లు, సాదుద్దీన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందర్ని కొన్ని రోజుల పాటు రిమాండ్ లో ఉంచి విచారించారు. సాదుద్దీన్ చంచల్ గూడ జైల్లో ఉండగా.. ఐదుగురు మైనర్లు జువైనల్ హోంలో ఉన్నారు. ఈ క్రమంలో మైనర్లకు బెయిల్ మంజూరైంది. ఇప్పుడు సాదుద్దీన్ కు కూడా లభించింది.