బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతి బెయిల్ రద్దుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారన్న కేసులో రామచంద్ర బెయిల్ రద్దు చేయాలన్న బంజారాహిల్స్ పోలీసుల పిటిషన్ ను న్యాయస్థానం శనివారం కొట్టి వేసింది.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డును దుర్వినియోగం చేశారంటూ రామచంద్ర భారతిపై పోలీసులు గతంలో పలు యాక్ట్ ల కింద కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతి రిలీజ్ కాగానే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. అయితే అదే రోజు రామచంద్ర భారతికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
అనంతరం రామచంద్ర భారతి బెయిల్ ని రద్దు చేయాలంటూ డిసెంబర్ 15న నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే శనివారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది నాంపల్లి కోర్టు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ రద్దుకు తగిన కారణాలు లేవంటూ పిటిషన్ ను కొట్టివేసింది.