హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్నారు. కరోనా కేసులు అధికంగా పెరగడంతో అర్ధాంతరంగా ముగిసిన ఎగ్జిబిషన్ ను మళ్లీ ప్రారంభిస్తన్నట్టు సౌసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. జనవరి ఒకటో తేదీన 81 వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.
అయితే.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో 2వ తేదీన అర్ధంతరంగా మూసివేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో తగు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎగ్జిబిషన్ ను ప్రారంభించేందుకు అధికారులు అనుమతినిచ్చినట్టు ఆదిత్య తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ పునఃప్రారంభానికి అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా నుమాయిష్ ను మళ్లీ ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేశారు.
దీంతో ఎగ్జిబిషన్ ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. ఎగ్జిబిషన్ 46 రోజుల పాటు కొనసాగించే అవకాశం ఉందని ఆదిత్య వెల్లడించారు.