బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కీలక నిందితుడిగా ఉన్ననందకుమార్ శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. నంద కుమార్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల అయ్యాక హైదరాబాద్ దాటి వెళ్లొద్దని, అందుబాటులో ఉండాలని సూచించింది.
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారనే కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ఏ2 గా చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇక దీంతో పాటు డెక్కన్ కిచెన్ వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్ నగర్ లోని ఓ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చి డబ్బులు తీసుకున్నారని నంద కుమార్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పై మరో రెండు కేసులు నమోదయ్యాయి.
ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తామని రామచంద్రభారతి, సింహయాజి,నందకుమార్ ఆశ చూపినట్టు ఆరోపణలున్నాయి. ముందు ఫైలెట్ రోహిత్ రెడ్డిని కలిసిన ఈ నేతలు మెయినాబాద్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించిన ఆడియో, వీడియోలను టీఆర్ఎస్ బయటపెట్టింది.
ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 26వ తేదీని ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 41 ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ ను తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసును సిట్ నుంచి సీబీఐ టేక్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఎమ్మెల్యేల ఎర కేసు.. ఇంకెన్ని ట్విస్ట్ లు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.