బాలకృష్ణ తరువాత ఆయన వారసుడిగా వెండితెరపై మోక్షజ్ఞ సందడి చేస్తాడని అంతా భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా అనే ఆత్రుతతో నందమూరి అభిమానులు కూడా మరోవైపు ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకి నటన పట్ల ఆసక్తి లేదనే టాక్ ఆ మధ్య వినిపించింది. ఆయనకి సంబంధించిన ఫొటో ఒకటి బయటికి రావడం, అందులో మోక్షజ్ఞ చబ్బీగా ఉండటం చూసి, ఇక ఆయనకి యాక్టింగ్ వైపు వచ్చే ఆలోచన లేదని అనుకున్నారు.
కానీ నటనలో శిక్షణ ఇప్పించడం కోసం కుటుంబ సభ్యులంతా కలిసి ఆయనని న్యూయార్క్ పంపించనున్నారని తెలుస్తోంది. ‘న్యూయార్క్ ఫిల్మ్ అండ్ థియేటర్ ఇనిస్టిట్యూట్’లో శిక్షణ నిమిత్తం ఆయనను పంపిస్తున్నట్టు చెబుతున్నారు. స్టార్ హీరోల పిల్లలు చాలామంది ఇక్కడే నటనలో తర్ఫీదును పొందారట. 12 వారాల కోర్సును పూర్తి చేసుకుని మోక్షజ్ఞ తిరిగి వస్తాడని అంటున్నారు. ఆ తరువాత మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.