23వ ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మహాసభలకు ఈ సారి ముఖ్య అతిథిగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. తానా మహాసభలకు ముఖ్య అతిథిగా రావాలని హీరో బాలకృష్ణను ఆ సంఘం అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ఆహ్వానించారు.
తానా ఆహ్వానాన్ని మన్నించి మహా సభలకు హాజరు కానున్నట్టు బాలకృష్ణ వెల్లడించారు. గతేడాది బసవ తారకం ఆస్పత్రికి తానా సభ్యులు రూ. కోటి విరాళం అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా తానా సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మాట్లాడుతూ…. ఎన్టీఆర్ శతవసంతోత్సవ సమయంలో జరుగుతున్న మహా సభలకు బాలయ్య బాబు హాజరవుతుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. నిజయంగా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఇది చాలా సంతోషాన్ని కలిగించే వార్త అన్నారు.
ఈ మహాసభలకు బాలయ్య బాబు రావడం ప్రవాస భారతీయులందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందన్నారు. అనంతరం తానా వేడుకలకు బాలకృష్ణ హాజరవుతున్నట్టు తెలియజేసేలా ఓ ప్రత్యేక టీజర్‌ను ఎంపీ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ఇటీవల విడుదల చేశారు.
అమెరికాలో తానా మహా సభలు ప్రతీ రెండేండ్లకు ఓ సారి జరుగుతాయి. ఈ ఏడాది కూడా జూలై నెలలో తానా సభలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆ సంఘం సభ్యులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.