ఎప్పటికైనా పూర్తి ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశించిన కుటుంబ సభ్యులను, అభిమానులను తీవ్ర శోకసంద్రలోకి నెట్టివేశారు నందమూరి తారకరత్న.జనవరి 27న గుండెపోటుకు గురైన ఆయన బెంగళూరులోని నారాయణ హృదాయలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 23 రోజుల సుధీర్ఘ పోరాటం తర్వాత తుది శ్వాస విడిచి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న తారక రత్న రాజకీయాల్లోకి అడుగు పెట్టి ప్రజలకు సేవ చేద్దామన్న చివరి కోరిక నెరవేరకుండానే మృత్యు ఒడిలోకి జారుకున్నారు. అయితే ఆయన 2002లో ఒకే రోజు 9 సినిమాలను లాంచ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. కానీ అప్పటి నుంచే తారకరత్నకు 9వ నెంబర్ కలిసి రాలేదు.
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ఆ తర్వాత చేసిన సినిమాల్లో హీరోగా పెద్దగా రాణించలేకపోయినా ప్రతినాయకుడిగా మాత్రం అలరించారు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాలో ఆయన విలనిజానికి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.
నందమూరి తారకరత్న ఎంతగా ప్రయత్నించినప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రజా సేవకోసం కృషి చేద్దామన్న ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావించారు.
ఇలా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో తన బావ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో గుండెపోటుకు గురయ్యారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేర్పించిన విషయం తెలిసిందే.
బెంగళూరు హృదయాలయ ఆస్పత్రిలో విదేశీయి వైద్యుల సహకారం, ఇతర మెరుగైన సేవలతో చికిత్స పొందిన తారకరత్న కన్నుమూశారు. 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.
తారకరత్న మరణవార్తతో నందమూరి వంశంలోనే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన చనిపోయారన్న వార్తతో నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు.