తారకరత్న భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకొచ్చారు. మోకిళ్లలోని తారకరత్న స్వగృహం నుంచి కాసేపటి క్రితమే ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. తారక్ తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు.
పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు తారకరత్నకు నివాళులు అర్పిస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఫిల్మ్ ఛాంబర్ కు తరలివస్తున్నారు.
ఆదివారం చిరంజీవి, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, అశ్వీనిదత్, రాజశేఖర్, ఆలీ, నారా రోహిత్, రవిబాబు తదితరులు తారకరత్న నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.