తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు లోనయ్యింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి నుంచి ఆమె ఆహారం తీసుకోకపోవడంతో నీరసించింది. భర్త కోలుకుంటాడేమో అనే ఆశతో 23 రోజుల పాటు వేచి చూసింది అలేఖ్య. తన భర్త తిరిగి మామూలు మనిషి అవ్వాలని కోరుకుంది. కానీ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. మానసిక ఒత్తిడికి లోనయ్యింది. ఈ క్రమంలోనే ఆమె నీరసించిపోయింది.
తారకరత్న మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. భార్య అలేఖ్య రెడ్డితో పాటు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తారకరత్నకు నివాళులర్పించేందుకు విచ్చేస్తున్న కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అలేఖ్యను పరామర్శించి ఓదార్చుతున్నారు.
అయితే తారకరత్న మరణించారని వైద్యులు ధ్రువీకరించినప్పటి నుంచి ఆమె కంటతడి ఆరడం లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ధైర్యం చెబుతున్న తారకరత్న అకాల మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది.
కాగా తారకరత్న, అలేఖ్య రెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు అమ్మాయిలు కాగా, ఒక అబ్బాయి. అయితే అలేఖ్య రెడ్డికి ఇదివరకే పెళ్లై విడాకులు తీసుకుంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అలేఖ్య, తారకరత్నలకు పరిచయం ఏర్పడింది. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో.. గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి ఇరు కుటుంబ పెద్దలు వీరి వివాహాన్ని అనుమతించారు.