సినీ నటుడు నందమూరి తారకరత్న హార్ట్ ఎటాక్ తో ఇటీవలే మరణించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అనంతరం 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకునేలోపు ఇలా జరిగిందని అభిమానులు బాధపడుతున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన చివరి మాటలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. తారకరత్నతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల అనుబంధం ప్రత్యేకమనే చెప్పాలి. ముఖ్యంగా తారకరత్నకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ నా తమ్ముడే కదా.. జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు. అలాగే ప్రేమగా చూడాలి అనే వాటిని కూడా నేను నమ్మను. తను నందమూరి బిడ్డ, నందమూరి రక్తం, నా తమ్ముడు. ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడే అని పేర్కొన్నారు. అన్నకి తమ్ముడి మీద ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది’ అని ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తన మాటల్లో తారకరత్న వెల్లడించారు.
ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన ఆఖరి మాటలు కావడంతో అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంత మంచి మనిషి ఒక్కసారిగా అందరిని వదిలి వెళ్లడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.