నందమూరి తారకరత్న మృతితో సినీలోకం శోక సంద్రలో మునిగింది. ఆయన మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తారకరత్న. అనంతరం హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నాడు.
అయితే తారకరత్నకు బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం. తారక్ నటుడిగా ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి కెరీర్ పరంగా, వ్యక్తిగతంగానూ అన్నీ తానై అండగా నిలిచాడు బాలయ్య. ప్రతీ విషయంలోనూ బాబాయ్ వెన్నుతట్టి ప్రోత్సహించేవారని పలుమార్లు తారకరత్న కూడా చెప్పుకొచ్చేవాడు. తారకరత్నకు కూడా బాలయ్య బాబు అంటే అమితమైన ప్రేమ. ఆయన మీదున్న అభిమానంతోనే ఆయన సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు తారకరత్న.
కాగా జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్ తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.