“అంటే సుందరానికీ”.. నాని లేటెస్ట్ మూవీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కంప్లీట్ కామెడీ సబ్జెక్ట్. ఈ రోజు రిలీజైన టీజర్ లో కూడా అదే విషయం చెప్పారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటపెట్టాడు హీరో నాని. “అంటే సుందరానికీ” సినిమాలో కావాలని కామెడీ పెట్టలేదంటున్నాడు ఈ హీరో.
“సినిమాలో కామెడీ కోసం సీన్లు పెడతారు, కావాలని కొన్ని డైలాగ్స్ రాసుకుంటారు. కానీ “అంటే సుందరానికీ” సినిమాలో అలా కావాలని పెట్టిన సీన్లు ఉండవు. నవ్వించడం కోసం ప్రత్యేకంగా రాసిన లైన్ ఒక్కటి కూడా ఉండదు. కానీ సినిమా అంతా నవ్వుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అదే ఈ సినిమాలో ప్రత్యేకత.”
సినిమాలో కేవలం కథ మాత్రమే కనిపిస్తుందని, ఆ కథలో కామెడీని ఇరికించే ప్రయత్నం చేయలేదని అంటున్నాడు నాని. టైటిల్ లోనే హీరోయిన్ పేరును కూడా చెప్పడానికి కథ కారణం అంటున్నాడు. “అంటే సుందరానికీ” చూస్తే జంధ్యాల సినిమాలు మరోసారి గుర్తొస్తాయని చెబుతున్నాడు.
“ఈ సినిమాలో దర్శకుడు నవ్వించడానికి ప్రయత్నించలేదు. కేవలం తన కథను మాత్రం చెప్పాడు. ఆ కథే నవ్విస్తుంది. ఈ సినిమాలో నేను, నరేష్ కలిసి నటించాం. కొన్ని సన్నివేశాల్లో మేమిద్దరం మాట్లాడుకోం. కానీ ప్రేక్షకులు నవ్వుతారు. అలాంటి సీన్లు ఇందులో చాలా ఉన్నాయి. చిన్నప్పుడు జంధ్యాల గారి సినిమాల్లో ఉన్న కామెడీని మళ్లీ చూస్తారు.”
నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 10న ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.