నాని నటించిన సినిమా అంటే సుందరానికి. వివేక ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఆవకాయ్ తో పోలుస్తున్నాడు హీరో నాని. ఆవకాయ ఎలాగైతే రోజులు గడిచేకొద్దీ రుచి పెరుగుతుందో, తన సినిమా కూడా రోజులు గడిచేకొద్దీ పెద్ద హిట్ అవుతుందంటున్నాడు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరుపుకున్న నాని, తన సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని ఈ సంబరం చేయడం లేదని, ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నందుకు వేడుక చేస్తున్నామన్నాడు.
“ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్. అంటే సుందరానికి సినిమాకు వస్తున్న రెస్పాన్స్, అభిమానులు పెడుతున్న మెసేజులు చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా వుంది. నా కెరీర్ టాప్ ఆర్డర్ లో వుండే సినిమా ‘అంటే సుందరానికి’. ఇది అవకాయ్ లాంటి సినిమా. మూడు రోజులు రుచి చూశారంటే రోజురోజుకీ ఊరుతుంది. రుచి ఇంకా పెరుగుతుంది. రెండేళ్ళ తర్వాత కూడా మంచి తెలుగు సినిమా పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే చెప్పే రెండు మూడు పేర్లలో అంటే సుందరానికి వుంటుంది” అని చెప్పాడు.
ఇలా తన సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు నాని. ఈ సినిమా వరకు తను కలెక్షన్ల గురించి ఆలోచించడం లేదన్నాడు. ఈ చిత్రానికి, మరో మూవీతో పోలికే లేదని, ఇలాంటి అరుదైన చిత్రాన్ని అందరం భుజంపై మోయాలని కోరాడు.
అంటే సుందరానికి సినిమాకు వసూళ్లు తగ్గాయి. ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇది కాస్త ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే, ఈ వీకెండ్ కచ్చితంగా మంచి వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఆ టెన్షన్ యూనిట్ లో కనిపిస్తోంది.