నేచురల్ స్టార్ నాని తన నానీస్ గ్యాగ్ లీడర్ సక్సెస్ గురించి మంచి ఆశలే పెట్టుకున్నాడు. మరి ఇంతకీ తన ఆశలను దర్శకుడు విక్రం కుమార్ నిలబెడతాడా లేదా అనేదే ఇప్పుడు ఒక పెద్ద పజిల్. నానీస్ “గ్యాగ్ లీడర్” సెన్సార్ టాక్ ఏంటో ?
నానీ కొత్త సినిమా ‘నానీస్ గ్యాంగ్ లీడర్’కి అస్సలు హైప్ లేదు. ఎక్సైట్‌మెంట్ అసలే లేదు. సెన్సార్ టాక్ కూడా యావరేజ్ అని అంటున్నారు. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ ఇచ్చిన విక్రంకి ఉన్నట్టుండి టాలీవుడ్లో హైప్ వచ్చేసింది. ఆ తర్వాత తమిళంలో సూర్యతో చేసిన 24 కూడా బాగానే ఆడినా, తను చివరిగా అఖిల్‌తో చేసిన హలో సినిమా మాత్రం బాగా నిరుత్సాహ పరిచింది. ఇప్పుడు నానితో చేస్తున్న ఈ గ్యాంగ్ లీడర్ సక్సెస్ అవడం తనకూ చాలా ముఖ్యమే.
నానీస్ గ్యాంగ్ లీడర్ కథ విషయానికి వస్తే, ఇది కూడా ఒక కొరియన్ సినిమాకు రీమేకే అని వినిపిస్తుంది. కొరియన్ యాక్షన్ కామెడీ హిట్ సినిమా అయిన గర్ల్ స్కౌట్‌కు నేటివిటీ జోడిస్తూ అక్కడా ఇక్కడా పుష్కలంగా మేకప్పులు వేసి విక్రం ఇప్పుడు ఈ నానీస్ గ్యాంగ్ లీడర్‌గా మనకు చూపించబోతున్నాడనేది టాక్. మనకు టీజర్‌లోనే చూపించేసినట్టు ఐదుగురు ఆడవారితో నాని శ్రీకృష్ణుడిలా ముందుండి జరిపే కురుక్షేత్రం అని చెప్పారుగా. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు యువతులు ఒకరి వల్ల తమ కుటుంబాన్ని కోల్పోయి కష్టాల పాలవుతారు.
పగ తీర్చుకోవడమెలాగా అని ఆలోచిస్తున్న వీరికి ఒక క్రైమ్ స్టోరీ రైటర్ అయిన పెన్సిల్ పార్థసారథి, అదేనండీ మన నానీ తారసపడతాడు. ఆ తర్వాత నానీతో పరిచయం పెంచుకుని నానీ రాసే కథల్లోని లాజిక్స్‌తో తమ శత్రువులను మట్టుబెడుతూ పగ తీర్చుకుంటారు. అసలైన మెయిన్ విలన్‌ని అంతమొందించడంలో మాత్రం ప్రత్యక్షంగా హీరోయే రంగంలోకి దిగుతాడు. స్టోరీపరంగా అంత గొప్పగా చెప్పుకునేది ఏదీ లేకున్నా, కథలో వచ్చే కొన్ని కీలక మలుపులతో పాటూ సినిమా ఆద్యంతం నానీ పంచే కామెడీ గ్యాంగ్ లీడర్ సినిమాకు హైలైట్ అవుతుందని నిర్మాతల ఆశ. అలాగే మొదటిసారిగా నెగెటివ్ రోల్ పోషిస్తున్న ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయకు కూడా ఇది బ్రేక్ ఇచ్చే సినిమా అని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటికే విడుదలయిన అనిరుధ్ రవిచంద్ర సంగీతంలోని పాటలు ఫరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం మాత్రం సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్ళేలా ఉందంటున్నారు. మొత్తమ్మీద సినిమా కథ విషయంలో పెద్దగా స్పెషల్ అంటూ ఏదీ లేకపోయినా, దర్శకుడు విక్రం అండ్ హీరో నాని మరోసారి ట్విస్ట్స్ అండ్ కామెడీలపై నమ్మకం పెట్టుకున్నారు. మరి రేపు బొమ్మ థియేటర్లో పడ్డ తర్వాత వీళ్ళ ముఖాలపైకి నవ్వులు వస్తాయా లేక నవ్వులపాలవుతారా వేచి చూడాలి.