సీఎం జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రం మళ్లీ గాడిన పడాలంటే.. మరో పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని పేర్కొన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. 16వ రోజు యువగళం పాదయాత్ర ఎస్ఆర్ పురం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. స్థానిక హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు లోకేష్.
పాదయాత్రలో భాగంగా ఎస్ఆర్ పురం పుల్లూరు క్రాస్ రోడ్డులో ప్రజలను ఉద్దేశించి లోకేష్ సిద్ధమవ్వగా.. పోలీసులు అడ్డుకుని మైక్ ను లాక్కున్నారు. దీంతో లోకేష్ అక్కడికి వచ్చిన ప్రజల్ని మౌనంగా ఉండమని చెప్పి.. మైక్ లేకుండానే ప్రసంగించారు. టీడీపీ హయాంలో జగన్ పాదయాత్రలను ఏనాడూ అడ్డుకోలేదన్నారు.
తాను టెర్రరిస్టును కాదని ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. జగన్ లాగా దేశాన్ని దోచుకుని తాను జైలుకు వెళ్లలేదని దుయ్యబట్టారు. తన మైక్ లాక్కోవడానికి వచ్చిన వెయ్యి మంది పోలీసులు.. ఇదే విధంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవాలంటూ హితవు పలికారు.
వైసీపీ వాళ్లకి అమలు కాని.. జీవో నెంబర్ 1 తనకే ఎందుకు అమలు అవుతుందని ప్రశ్నించారు లోకేష్. జగన్ యాదవ సోదరులకు ఇచ్చిన హామీని అమలు చేశాడా? కార్పొరేషన్ నిధులను ఇచ్చాడా? అని నిలదీశారు. జగన్ యువతకు వెన్నుపోటు పొడిచాడన్నారు. ఈ విధానం మారాలంటే మళ్లీ బాబు రావాలని పిలుపునిచ్చారు నారా లోకేష్.