తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. 55వ రోజుకు చేరుకున్న లోకేష్ పాదయాత్ర.. గురువారం 700 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. గురువారం ఉదయం పెనుగొండ నియోజక వర్గంలో పర్యటించి అనంతరం కియో పరిశ్రమను పరిశీలించారు. ఆ తర్వాత పాదయాత్ర గుట్టూరు గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇందుకు గుర్తుగా గుట్టూరులో లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఈ మైలురాయి గోరంట్ల మండలం మరియు మడకశిర ప్రాంతాల తాగు, సాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి పునాది కానుందని తెలిపార. టీడీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు లోకేష్.
అంతకుముందు.. కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరారు. అప్పటి ప్రభుత్వంలో అనేక పరిశ్రమలను తీసుకువచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందే తప్ప.. చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామని అన్నారు. పాదయాత్రలో దారి వెంబడి వెళ్తుండగా ఉన్న పరిశ్రమల ముందు ఆగి లోకేష్ సెల్ఫీ తీసుకుంటూ టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు.
తాము చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కియా పరిశ్రమ రావడం చంద్రబాబు ఘనతే అని చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రజావేదిక కూల్చివేతతో వైఎస్ జగన్ పరిపాలనను ప్రారంభించారన్నారు. అన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లడమే కానీ కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. వైసీపీ సర్కార్ ది విధ్వంస పాలన అని విమర్శించారు. అభివృద్ధి చేయాలన్న తలంపు ఏకోశాన జగన్ సర్కార్ కు లేదని విమర్శించారు నారా లోకేష్.