గుంటూరు: ‘పాదయాత్రలో ఎవ్వరేమి అడిగినా కోటలు దాటే హామీలిచ్చారు . తీరా అధికారంలోకి వచ్చేసరికి అన్నీ కోతలే వేస్తూ కోతలరాయుడుగా జగన్ మారిపోయాడు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. మంగళగిరి మండలం నవులూరులో మంగళవారం జరిగిన గ్రామ టీడీపీ సమావేశంలో లోకేశ్ వైసీపీ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 4 నెలలు కూడా పూర్తి కాక ముందే విమర్శించకూడదని అనుకున్నా దారుణమైన జగన్ ప్రజావ్యతిరేక పాలనపై తప్పనిసరి అయి స్పందించాల్సి వస్తోందన్నారు. పాదయాత్రలో ఏ ఒక్కరు ఏమి అడిగినా ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చేసరికి ఆ హామీలన్నీ మరిచిపోయి కోతలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
కరెంటు కోత, ఇసుక కొరతతో ప్రజలు అల్లాడుతున్నా నవరత్నాలంటూ నవ్వులు చిందించడం జగన్‌కే చెల్లిందని లోకేశ్ అన్నారు. 900 పైగా హామీలిచ్చి 9 హామీలే అమలు పరుస్తామని చెప్పి దానికి నవరత్నాలని పేరుపెట్టారని, ఇందులో నెలకో రత్నం రాలిపోతోందని ఎద్దేవా చేశారు. సమస్యలతో తలబొప్పి కట్టిన ప్రజలు చివరికి నవరత్నం తైలం రాసుకోవాల్సిందేనన్నారు. సన్నబియ్యం అన్నారు…ఇస్తున్న బియ్యాన్నే తిన్నగా ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు. రూపాయి బియ్యానికి 9 రూపాయల సంచిలో ఇవ్వడం ఒక్క జగన్ కే సాధ్యమన్నారు. పోలవరం రివర్స్ టెండర్ అంటూ వందల కోట్లు మిగిల్చామని గొప్పగా ప్రకటించుకోవడం వెనుక చాలా ప్రమాదకరమైన చర్యలున్నాయన్నారు. టీడీపీ హయాంలో అత్యంత నాణ్యమైన జర్మనీ టర్బయిన్లు వాడాలని ఒప్పందం ఉందని, రివర్స్ టెండర్ లో ఇప్పుడు అత్యంత నాసిరకమైన చైనా టర్బయిన్లు బిగించనున్నారని తెలిపారు. దశాబ్దాలు నిలవాల్సిన ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో రాజీ పడి..తమ వారికి టెండర్ కట్టబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నవయుగ పోలవరం పనులు బ్రహ్మాండంగా పూర్తిచేస్తుండగా తమవారికి పనులు కట్టబెట్టేందుకు కేవలం ఎత్తిపోతల పథకాలు మాత్రమే కట్టిన అనుభవం ఉన్న వారికి రివర్స్ టెండర్ కట్టబెట్టడం హార్ట్ ఆపరేషన్ ఐ స్పెషలిస్టుతో చేయించినట్టుంది అని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంతంలో తనకు 500 ఎకరాలుందని ఇష్టానుసారంగా ఆరోపించిన వైకాపా ముఖ్యులు, కనీసం అర సెంటు భూమైనా ఉందని ఈ రోజుకీ నిరూపించలేకపోయారని అన్నారు. టీడీపీ హయాంలో చంద్రన్న బీమా ఎన్నో కుటుంబాలకు ఆసరా అయ్యిందని, జగన్ సీఎం అయ్యాక ఆ ధీమా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ నెలా ఒకటో తారీఖున తాత అవ్వలు, వితంతువులు, వికలాంగులకు వచ్చే పింఛన్లు.. మూడు వేల చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పి…ఇప్పుడు ఏ రోజు ఇస్తారో తెలియని పరిస్థితికి తీసుకెళ్లారని ఆరోపించారు. మంగళగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపించిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎప్పుడూ కనిపించరని,అనేక సమస్యలు ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే అయన మాత్రం ఎప్పుడూ కరకట్టపైనే తిరుగుతుంటారని, చంద్రబాబు ఇంటికి కాపలా ఉండేందుకు ఆయనను ఎమ్మెల్యే అయ్యారా అనే అనుమానం కలుగుతోందన్నారు. అధికారంలోకొచ్చిన నాలుగు నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న ముఖ్యమంత్రిని దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ఈ నాలుగు నెలల్లో ఒక్క ప్రజావేదిక కూల్చడం తప్పించి ఏ ఒక్కటైనా కట్టగలిగారా అని ప్రశ్నించారు.