చంద్రబాబు, లోకేష్‌కు చీర పంపిస్తామని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. రోజా తనకు చీర పంపిస్తా అంటున్నారని.. ఒకవేళ ఆమె తనకు చీర పంపిస్తే తాను తీసుకుని గౌరవప్రదంగా తన తల్లికి ఇస్తానని లోకేష్ తెలిపారు. కానీ, మహిళా మంత్రిగా ఉన్న రోజా తనపై చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా జాతినే కించపరిచేలా ఉన్నాయని లోకేష్ మండిపడ్డారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి వెళ్లి అఘాయిత్యానికి బలైన.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు లోకేష్. మంత్రి రోజా మొత్తం మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మంత్రులు శాసనమండలిలో మాట్లాడరని, శాసనసభలో తన తల్లిని అవమానించారని.. ఇప్పుడు మహిళా మంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని మండిపడ్డారు.
మంత్రిగా ఉండి.. సాటి మహిళ అయి.. చీరలపై వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీరలు కట్టుకున్న మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతారా అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లాలో రెండు ఘటనలు జరిగాయని.. ఈ ఘటనలు మహిళా కమిషన్ ఛైర్మన్‌కు కనిపించవా..? ప్రశ్నిస్తే నోటీసులు పంపిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు.
దమ్ముంటే మహిళా మంత్రులు తిరుపతమ్మ విషయంలో దిశ చట్టం అమలు చేసి నిందితులను 21 రోజుల్లో శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. ఇక గ్యాంగ్ రేప్ జరగలేదని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పడాన్ని తప్పుబట్టారు. అసలు పోస్టుమార్టం పూర్తి కాకుండానే అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్పారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఈ కేసులో నిందితులను తప్పించే దిశగా కుట్రలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు.