నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 8.30 గంటల వరకు అనేక స్టేషన్లు తిప్పారు. అసలు ఏం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేశారు. రమ్య కుటుంబానికి అండగా నిలబడడం మేం చేసిన తప్పా..? మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు… వైసీపీ నేతలను ఎందుకు అదుపులోకి తీసుకోలేదో డీజీపీ చెప్పాలి. నేను ఏం తప్పు చేయలేదు కాబట్టే 151 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.
దిశ చట్టం తెచ్చామని చెబుతున్నారు.. 20 రోజుల్లో గనుక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21వ రోజున టీడీపీ ఉద్యమిస్తుంది. మహిళలపై ఏదైనా జరిగినప్పుడు బుల్లెట్ కన్నా ముందు వస్తానన్న జగన్ ఎక్కడికెళ్లారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత సీఎం స్పందించడం బాధాకరం.
జగన్ తన చెల్లికే న్యాయం చేయలేదు. ప్రాణ రక్షణ లేదని ఆమె ఆక్రోశిస్తోంది. పులివెందులలో నాగమ్మను చంపితే పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందిపై దాడులు జరిగాయి. రాష్ట్రం మొత్తం పర్యటించి బాధిత కుటుంబాలను కలుస్తాం. ప్రజల తరఫున మేము పోరాటం చేస్తుంటే… సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు.
గన్ లేని జగన్ సీఎం అయ్యాకే ఎపీలో దాడులు పెరిగిపోయాయి. అధికార పార్టీ నేతలు నిందితులకు కాపలా కాస్తున్నారు. దిశ చట్టం కింద ఒక్కరికైనా శిక్ష వేశారా..? మీ సొంత పేపర్ కి దిశ పేరుతో రూ.30 కోట్ల యాడ్స్ మాత్రం ఇచ్చుకున్నారు. దిశ చట్టంపై మీ ఎంపీ మాధవ్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకి కేంద్రం ఎలా స్పందించిందో చూశాం. రమ్యశ్రీని అతి దారుణంగా చంపడం బాధాకరం. ప్రభుత్వం స్పందించిన తీరు కూడా చాలా బాధ కలిగించింది.
జగన్ రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మీ వాళ్లకి జరిగితే ఇలాగే స్పందించే వారా..? పది లక్షలతో చెల్లెళ్ల ప్రాణానికి విలువ కడతారా..? నరసరావుపేటలో అనూషను చంపిన వారు బెయిల్ పై బయట తిరుగుతున్నారు. మేము పరామర్శకి వెళ్లి బయటకు వచ్చాక వైసీపీ రౌడీలు మా మీదకు వచ్చారు. మాపార్టీ మహిళలను దుర్భాషలాడారు. నీచంగా మాట్లాడారు. పోలీసులు వారిని వదిలేసి మా నాయకులను అరెస్ట్ చేశారు. ఆడవాళ్లు, మాజీ మంత్రులను ఈడ్చుకెళతారా..? రమ్యశ్రీ కుటుంబ సభ్యుల కోరిక మేరకే మేము అక్కడకి వెళ్లాం.
Advertisements
జగన్ రెడ్డి చేతకానితనం వల్లే రాష్ట్రం రావణకాష్టంగా మారుతోంది. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టే శ్రద్ధ.. అమ్మాయిల రక్షణపై చూపించడం లేదు. పోలీసులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా కేసులు పెడుతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. రెండు ఛానల్స్ కెమెరాలు పగులగొట్టారు. మీడియాపై దాడి చేశారు. పోలీసులు బాడీ కెమెరాలు పరిశీలించి న్యాయం చేయండి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తే… ప్రజలే బుద్ధి చెబుతారు.